Wednesday, February 20, 2019

బి.నర్సయ్య_ పెద్దపల్లి
9491041835 06-07-2009.
ప్రియమైన రాఖీ గారూ.....!

ధర్మపురి నరహరి శతకం -REVIEW


మీ ధర్మపురి నరహరి శతకం సాంతం చదివాను.మరొక్కసారి ధర్మపురి వీథుల్లో ,గోదావరి తీరాన విహరించిన అనుభూతి_’సిరివెన్నెల ’లో – ఈ గాలీ ఈ నేలా - పాటలా.
భక్తిరసానికి ఆధునికతను జోడించి తేలికైన పదాలతో మీ భావాల్ని, అనుభూతుల్ని సూటిగా ఆవిష్కరించారు.
పదప్రయోగంలో మీ విలక్షణత అనితర సాధ్యం, ఈ కావ్యానికి ప్రత్యేక ఆకర్షణ అదే! ఆభరణాల్లో కంసాలి రాళ్ళను పొదిగినట్లు పదాలను కూర్చి పద్యాలను మెరిపించే నైపుణ్యత మీలో ఉంది.
నాకు తోచిన రీతిలో _ఈ సంపుటిలో రెండు విభిన్న వస్తువు(content)లతో కూడిన పద్యాలున్నాయి.ఒకటి –ధర్మపురి నరహరిని స్తుతిస్తూ ,అనుగ్రహాన్ని ఆశిస్తూ ,ధర్మపురి క్షేత్ర ప్రత్యేకతల్ని వర్ణిస్తూ ఉన్న పద్యాలు , ఇవి భక్తిరస ప్రధానమైనవి ,వీటన్నింటికీ ’ధర్మపురి నరహరి ’ అన్న చివరి పాదం ,వాటిని సంపూర్ణం చేస్తుంది.
ఉదా|| 1 నుండి 40 దాకా పద్యాలు.
రెండో రకం- సమాజాన్ని సరిదిద్దాలనే ఆకాంక్షతో దానిపై సంధించిన బాణాలు – మానవతా వాదానికి ప్రతీకలు, ఉదా|| 49 నుంచి దాదాపు మిగతావన్నీ.వీటికి ’దర్మపురి నరహరి ’ అన్నది అదనపు పంక్తియే.మొదటి మూడు పాదాలతో ఇవి నిక్కచ్చిగా నానీలే.మిగితావి ’నా’ ,’నీ’ లు కావచ్చు.
ఈ కాలం కవులు తమ సంపుటాలను ముఖచిత్రాల విషయంలో ,ముద్రణ విషయంలో Novelty కోరుకుంటున్నారు.దాని వల్ల Readers & Saleability పెరుగుతుంది.
నిరంతర పఠనం ద్వారా కవి మరింత ఉత్తమ కవిత్వాన్ని అందించగలడని ఓ పీఠిక లోఉంది. పేజీ 11 చివరి పంక్తి- నేటి కవులకు నాటి కవుల పఠనం అని ఉండాలేమో ....
భావ స్పష్టతతో పాటు భావ గర్భితం కవనాన్ని రసమయం చేస్తోంది. భావగర్భిత కావ్య సృష్టి అశేష ,విశేష కృషి దీక్షలతోనే సాధ్యం. అది ఓ తపఃఫలం .ఈ దిశలో పయనిస్తున్న నీవు మరింత సఫలీకృతుడివి కావాలని కాంక్షించే ఓ సాధారణ పాఠకున్ని నేను.

SANGEETHA GEETHA REVIEW

శబ్దం నిద్ర పుచ్చుతుంది
శబ్దం నిద్రలేపుతుంది
శబ్దం మనసును వెన్న ముద్ద చేస్తుంది
శబ్దం భయపెడుతుంది
ఆ శబ్దం సంగీతం గా రావచ్చు
గీతంగా రావచ్చు
శబ్దానికి భాష అర్థాన్నిస్తే
సరిగమలు ప్రాణం పోస్తాయి
“శబ్ద శిల” “సంగీత – గీత శిల్పం” గా మారిన వైనం
దాని మహత్తు, అది అలరించేతీరును అంశంగా తీసుకొని
మీరు సృజియించిన ఈ రచన నిరుపమానము!
సంగీత –గీత సారాన్ని ఆస్వాదించి జన్మ సుసంపన్నం చేసుకోమని, సరిగమలను శ్వాసిస్తే అవే జీవన వీణను సరి చేస్తాయని ప్రబోధిస్తోంది మీ సంగీత గీత.
కళలు టైంవేస్టు ,అనే పిచ్చోళ్లకు ’యంత్రానికైనా కావాలి ఒరాలింగు-రెస్టు’ – అనే సందేశం నేటి తరానికి లేహ్య సమానం.
“బ్రహ్మ కేటాయించిన శ్వాసల కోటా
ఎప్పుడయిపోతే అప్పుడే టాటా! “
ఎంత సింపుల్ గా జీవిత రహస్యం విప్పారు-అత్యద్భుతం!
“” టీవీ చూస్తే పని పాడే ,బెటర్ ఐపాడే , దానికదే పాడే “”
“పాడే” త్రిపాత్రాభినయం చేసింది
“” చింతకాయలు రాలాయా సంగీతమంటే అంతేమరి “”
కొత్త నడక!
రాళ్ళే కరిగినప్పుడు చింతకాయలు రాలకపోవడమేంటి?
“” ఫ్రీగా వస్తే దేనికైనా ఎగబడతాం
పుస్తకాలైతే మూలన బెడతాం “”
చెప్పును బట్టలో పెట్టి దవడ పై కొట్టినట్లుంది
Single concept పై రాసినా ఎక్కడా repetition పోవడం మీ ప్రతిభకు తార్కాణం!
ఈ రచన లో వ్యంగ్యం ఉంది.వేదాంతం ఉంది. లలిత కళలనాశ్రయించి జీవనకారడవిని నందనవనంగా మార్చుకోమని ఉద్బోధ ఉంది.
సమాజం పట్ల బాధ ఉంది. బాధ్యత ఉంది. ఎంత చెప్పినా బుద్దిరాదేం అని అక్రోశం ఉంది.
సప్తస్వరాల్లా ఏడు పరిచయ వాక్యాలున్నాయి.positive గా వివరణాత్మకంగా బాగున్నాయి. ఒకే school of thought కు సంబంధింనట్లున్నాయి.
రచనలో ఎలాంటి భాగస్వామ్యం లేని జీవిత భాగస్వామిని చివరి అట్టపై వామపక్షాన చేర్చుకోవడం- ఎల్లవేళలా గీతను పలవరించడమనుకోవాలా!
మీరన్నట్లు ఒకేరాత్రి ఇవన్నీ రాయడం నిజమైతే మీ ప్రతిభ అంచనాలకందనిదే!
ఈ ప్రతిభ మరిన్ని కవన రీతుల్లో భాసిల్లి మీరు పరిపూర్ణ కవిగా రాణించాలని నా ఆకాంక్ష _
_బి.నర్సయ్య.