Wednesday, April 29, 2009

’కవి’ ’తా వి’పంచి -’నవ’తా విరించి-శ్రీశ్రీ (శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా-నివాళి) -రాఖీ

కవి’ ’తా విపంచి -’నవతా విరించి-శ్రీశ్రీ
(శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా-నివాళి)
-రాఖీ
ఛందో బంధాలను త్రెంచి
కవితా గంధాలను పంచి
భాసించిన శత వసంతాల విరించీ !
ఏమందును శ్రీ శ్రీ నీ గురించి !!
ఏకలవ్య శిశ్యుడనై సంస్మరించి
నమస్సులర్పించెద శిరస్సు వంచి !!!


Tuesday, April 28, 2009

నిత్యం నానే సత్యం

పిప్పి పన్ను నొప్పి
గోరుచుట్టుబాధ
అర్షమొలల శూల
ఇల్లాలి గోల!!

బూటు కంటె
ఘాటు పోటు
నీ చేతిలో ఓటు
అది నీ(నిరసన)కు దీటు

డెంగ్యూ ,చికెన్ గున్యా
బర్డ్ ఫ్లూ ,స్వైన్ ఫ్లూ
వైరసైతేనేం
ప్రతిదీ సైతానే?!

బియ్యం రేటు దయ్యం
పప్పు కొంటే గొప్పే
నూనె దయ మానె
పూట తిన్నామానె!!


కడుపుల్లేంది
కావలిస్తే వస్తుందా?
కుటిల కాంగ్రేస్
తెలంగాణా ఇస్తుందా ???!!!!!!!!!!!!

పైవాడు ప్రాజెక్టులు
కట్టుకుంటూ పోతే…..
ఆడ చెఱువులు!
ఈడ ఎడారులు!!!

Tuesday, April 21, 2009

ప్రే రణము
ప్రేమ రణము
ప్రేమ మరణము
కాదా ప్రేమకారణము

Sunday, April 12, 2009

నానీ నానీలు
రాఖీ చిరు కానుక!
మీకీ
నానీల బోయీలు
పాటల పల్లకి!!

నా నీ లేని అవని
ఆనందగని!
నానీకవిని అవని
ఆ చందం గని!!

పద్యం
హృద్యమే కాదనను
నానీ దోసిటి నైవెద్యం!
అనుభవైక వేద్యం!!

కలం
ప్రసవించింది
కవల పిల్లలట!
నానీలు-గీతాలు!!



అలెగ్జాండర్!
ఆగిపోయినావా
కొనసాగుతోందింకా
నానీల జైత్రయాత్ర!

నానీల వరదలకు
ఆనకట్ట!
యూనిక్ కవుల
చిట్టా!!

మకుటమంతా
పసిడిదైనా
జిగేల్మను మణులే!
పఠేల్మను నానీలే!!

నానీ
కవితకు కొత్త బాణీ
కరిగే మెత్తని
కమ్మని పేణీ


నానీ
అభినవ కుంభ కర్ణుడి
గురక
వదిలించే చురక!

స్వరాలు ఏడైతేనే
అన్ని రాగాలే!
వర్ణాలు యాభయ్యారు
నానీల నెన్నరూ!!

‘నా’లో ఉన్నదీ
‘నీ’లో ఉన్నదీ
ఎద దోచేదా చిన్నది!
‘నానీ’ అన్నది!!
_రాఖీ.
గొల్లపెల్లి రాం కిషన్
305,సప్తగిరి రెసిదెన్సీ,విద్యానగర్,కరీంనగర్.ఆం.ప్ర..

నానీ రాజకీయాలు

అవును తిండి ఇద్దరికీ
సమస్యే
ఒకడికి దొరక్క?
మరొకడికి అరక్క!

కరెంటు పోయిందా
ఎంత భాగ్యం!
ఇక ఖరీదు తక్కువ
క్యాండిల్ లైట్ డిన్నరే!!

ఓటర్లు
జూదర్లు
తాయిలాలు తాయిలాలే
పంచే డబ్బూ సారా పప్పుబెల్లలే!

మావా అంటే
ఎక్కడైనా అనుకో
నాకు
వంగతోట ఉంటే కదా?!

ఏ మున్సిపాల్టీ వాళ్ళు
మట్టు బెడతారు?
ఈ ఉగ్రవాదపు
పిచ్చి కుక్కల్ని!

రైతేల రాజు?
పెట్టుబడిని
గిట్టుబడిని
తూచలేని తరాజు!

ఆశ దోశ
అప్పడం వడ
రేట్లు చూస్తే
గుండెల్లో దడదడ!

బీడీ
కల్చర్(?)నేర్చుకుంది
సిగరెట్టయి
ఫోజులే కొట్టింది!

అయ్యో
అతడి తల కనబడదేం?
వెతలలో
కూరుకపోయిందేమో!

పండగే!
గారెలూ బూరెలూ సరే
అక్కలూ బావలూ తయారే
సంతోషం జాడ?

బిన్ లాడెన్
తన డెన్
వీడెన్?
ఎచటైనా కనబడెన్!?

ఒబామా
ప్రపంచ శాంతికి
నీవే భీమా
ప్రజలందరిదీ అదే ధీమా

ఊసరవెల్లులు
గుడ్లగూబలు
గబ్బిలాలు
కేరాఫ్ రాజకీయాలు

రాజకీయాల
రసవద్ఘట్టం!
ద్రవ్యోల్బణానికి
దగ్గరి చుట్టం!!

ఔరా! చిరంజీవి !
అవునా రాజకీయ చిరంజీవి
బాగౌనా
బడుగుజీవి?!

ఉగ్రవాదం
వాస్తవ నరమేధం
ప్రతిబింబింప
జేయలేని పదం

సిగరెట్టు
రేటు గుండెలదిరెటట్టు
చేస్తే పెంచేట్టు
మరి తాగితే ఒట్టు

అవ్వొచ్చు జూదం
తత్కాల మోదం
క్లైమాక్స్ మాత్రం
సదా విషాదం

కరినారం వా సినారె!
వాసి గీతాల్రాసినారె!!
జ్ఞానపీఠం
ఎక్కేసినారె!!!

ఓటు
కాదు తలపోటు
మార్చు గ్రహపాటు
వేయడం మంచి అలవాటు


ఎత్తులు
జిత్తులు పొత్తులు
రాజకీయ మహత్తులు
గమ్మత్తులు!!


ఆశపడ్తె నోటుకే
అమ్ముడౌతే ఓటుకే
బ్రతుకు బాట చేటుకే!
కాటికే!!

మున్ముందర
పడితే తొందర
కాదా బ్రతుకే
చిందర వందర

మనిషి మనుగడ కెన్ని
ప్రతిబంధకాలు!
కుల,మత,ప్రాంత
కందకాలు!!

నీవు లేకుండా పోవడం
కాదు చావు!
ఆత్మ నశ్వరమను మాట
మరిచావు!!

ఓడలు బండ్లయ్యే
సామెతలు
నిత్యాలు!
ఈనాడు సాక్షి’లేమన’ సత్యాలు!!

రియల్(?)ఎస్టేటులు!
రిలయెన్స్ వాటాలు
ఏమారితే
హర్షద్ మె’’తాలు’’!!

మనసున్న చోటే
మందలింతలు!
అభిమానముంటేనే కదా
అక్షింతలు!!
యత్ర నార్యస్తు ………..!
స్త్రీ
షట్కర్మయుక్తా
సహ ధర్మపత్ని!
నవభారత నిర్మాణపు మేస్త్రీ!!

అదోవింత కాదు
ఆడదే!
తల తిప్పకు
మెడ పట్టుకుంటుంది!!

రోజూ విప్పలేని
పజిల్ !
మా ఆవిడ అర్థం కాని
తియ్యటి గజల్!!

క్రీగంటి కాటుకా!
దేవదాసు లెందరిని
మాడ్చి మాడ్చి
మసి చేశావో!!

వేయించుకుంటారు
ఒంటిపై ‘టట్టూ’
దాపరికమే
లేదనేటట్టూ!

సినీతార మాత్రం
కాదు లోభి
ఉదారంగా
చూపెడుతుంది నాభి!

మీకు బొత్తిగా
లౌక్యం లేదండి!
అందుకే కదా
నిన్ను కట్టుకుంది!!

ప్రేమించామని
గొంతులుకోస్తారు
కామాంధులు
కాదంటే ఆసిడ్ పోస్తారు

చెలీ నే కొన్నది
నువు కట్టుకొన్నది
ఆచీర నాఎదనా
కట్టుకొన్నది!!

మా రమా
ఎపుడూ నీదయ కోరమా
భవసాగరమీద
మాకిక భారమా





రువ్వే
నవ్వులు
గుభాళించే పువ్వులు!
ప్రభాసించే దివ్వెలు!!

ప్రేమంటే ఏమంటే
ఆరని మంటే
అంటుకుంటే
బ్రతుకు కుంటే!

తిడ్తె ప్రేమే
గేలి జాలే
ఈర్ష్య కీర్తెరుగుటే
ఇదే థింక్ పాజిటివ్ అంటే!




జానపదం
ఆనంద పథం!
బతుకమ్మలు బొడ్డెమ్మలు
వాకిట్లో గొబ్బెమ్మలు!!


_రాఖీ.
గొల్లపెల్లి రాం కిషన్
305,సప్తగిరి రెసిదెన్సీ,విద్యానగర్,కరీంనగర్.ఆం.ప్ర..

ట్రాజెడీ?!



వి’నో’దం
వి’షా’దం
మారితే ఒకే అక్షరం
ఏమాఱితే మూల్యం జీవితం

మంచితనమంటే
“ ధార పోయడం ”
శ్రమ, సమయం, ధనం
ఏదైనా-అన్నైనా

కాశ్మీరు షాలువైనా
చీపైన కర్చీఫైనా
అల్ప సంతోషి కవి
ఏం ట్రాజెడీ?!

కత్తి మీకిస్తే
గుండెనూ కోసేయవచ్చు
తిండానికి
పండునూ కోసీయవచ్చు