Friday, September 18, 2009

ఇదీ తెలుగుదేశం
(వచన పద్య శతకము)
రచన : రాఖీ
వివరాలు:
రచన:ఇదీ తెలుగుదేశం(వచన పద్య శతకము)
రచయిత: గొల్లపెల్లి రాంకిషన్
కలంపేరు: రాఖీ
విద్య:సైన్స్ లో పట్టా
రచనా కాలం:1982-83
జననం:కరీంనగర్ జిల్లా,ధర్మపురి పుణ్యతీర్థ-క్షేత్రస్థలి లో
అటు గోదావరి గలగలలు- ఇటు నరహరి చల్లని దీవెనలు
జననీ జనకులు: శ్రీ గొల్లపెల్లి అంజయ్య గారు, శ్రీమతి వేంకట లక్ష్మిగారు
జన్మతేదీ: 02-05-1962(officially) 09-05-1963( actually)
ప్రవృత్తి: స్నేహాభిలాష
ఇతర రచనలు: రాఖీ గీత మాలిక , మనోదర్పణం
పూర్ణిమ ప్రచురణ-కరీంనగర్
నటరాజ్ ప్రింటర్స్, వరంగల్.
First Edition: Jan-1983.





కన్నుగుడ్డి కాలు కుంటి
కదరా బ్రదర్ నిన్నమొన్న
మేలుకున్నది ప్రజానీకం
ఏలుతుందిక తెలుగు దేశం!!
NTR –Photo
తెలుగుదేశాన్ని వెలుగు దేశంగా రూపొందించడానికి కంకణ ధారియై ప్రజామోదంతో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా శ్రీ నందమూరి తారక రామారావు అన్నగారికి శుభాకాంక్షలతో...................................రాఖీ






ముందు మాట
చిరంజీవి గొల్లపెల్లి రాంకిషన్ బియస్సీ తుది సంవత్సరంలో చదువు చున్నాడు.ఇతడు ధర్మపురి నివాసి.నేనొక తడవ ధర్మపురి కార్యాంతరమున వెళ్ళినప్పుడు పూజ్యులు బ్ర||శ్రీ|| కాకర్ల లక్షీ కాంత శాస్త్రి గారి ఇంటికి వెళ్ళియుంటిని. అచ్చట తానీ యువ కవి నాకు తన కవితను వినిపించగా వినుట తటస్థించినది. విన్నంతసేపు ఇంకా వింటే బాగుండుననిపించినది.పద్యాలో ,గేయాలో ,వచన కవితలో ఇతడేమి వ్రాసినాడో నాకు ఆ ఛందస్సుపై భావము పోలేదు.ఎంతసేపు ఇతడు స్వార్థపరుల నధిక్షేపించుచు వ్యంగ్య ధోరణిలో విరచించిన భావపరంపర నా హృదయాన్ని స్పందింపజేసిన దనుటలో అతిశయోక్తి ఆవంతయును లేదు.
ఇతడొక మంచి భావుకుడైన కవి. ఇతని కవితా శక్తి సమర్థమైనదనియు, ఇతనికి కవితా జగత్తులో ఉజ్వల భవిష్య్త్తు కలదని నా మనస్సు భావించినది. ఆనందించినది. ఈ కవి కవితలలో నుక్తిచమత్కృతి మరియు భావ సంపద చెట్టపట్టాలు గట్టుకొని పయనించు చుండుననుటకు కొన్ని పద్యముల కొన్ని గేయముల మచ్చుగా నిట నుదహరించుట నావిధి.
“ నీ దారి ఎడారిగా మారితే
గ్రీష్మఋతువు హేమంతమైతే
కన్నీళ్లతో దప్పిక తీర్చుకో
ఆకలి మంటతొ చలికాచుకో బ్రదర్ ! ”
ఇది ఒక వచన పద్యము. ఐనా ఇందులో చక్కని భావము ,సమాజ స్పృహ కల్గి యున్నది.ఆకలి మంటతొ చలి కాచుకొనుట , కన్నీళ్ళతో దప్పిక తీర్చుకొనుటలనే ఈ ఉక్తివైదగ్ధ్యము కడు క్రొత్తది.ఒక మాహా భావుకుడైన కవిగా ఇందులో నితడు దర్శన మిచ్చుటలేదా ! ప్రతిభా వంతుడైన కవియే ఇట్లు చెప్పగలడనుట నిస్సందేహము.
“ నీ వెనకగ నుయ్యెవరో త్రవ్వితే
నీ ముందొక గొయ్యే యెదురైతే
ఈత వచ్చి ఉంటే నూతిని ఎంచుకో
చేతకాకుంటే గోతినే ఎన్నుకో బ్రదర్ !”
ఓహో ఎంత చక్కని నిర్వచనము.వెనక నుయ్యి ముందు గొయ్యి తోచదనువారే సామాన్య మానవులంతా కాని క్రాంతదర్శి యైన కవి భావన తిలకించండి. దానికి నిష్క్రియ నుపదేశించు చున్నాడు. ఏమది? నీకు ఈత వచ్చి ఉంటే నూతిలో ఈదాడుచూ వెళ్ళిపొమ్మంటున్నాడు.ఇది కవి దృష్టి....... ఇంకొకటి>
ఇతడీ శతకము నందు వ్యంగధోరణిలోను చక్కని కవితల వెలయించినాడు. అందుండి ఒక వచన కవితను మచ్చుగా నుటంకింతును.
“ వెలగని అగ్గిపుల్ల
మొరగని కుక్క పిల్ల
నురుగురాని సబ్బుబిళ్ళ
నిక్కముగ నొక్క తీరె గదరా బ్రదర్ ! ”
ఇంతకు ముందు శ్రీశ్రీ మహాకవి అగ్గిపుల్ల .సబ్బుబిళ్ళా ,కుక్కపిల్లా, అన్నీ కవితా వస్తువులే అన్నాడు గాని వాని కవితాత్మను వెల్లడించలేదు.ఈ కవి దీనిలో నిన్న కవితాత్మను బయల్పరచినాడు. చిత్తగించవలె సహృదయులు.
అగ్గిపుల్ల వెలగని దేమి ప్రయోజన కారి? అదేమి దారి చూపించగలుగును?అట్లే మొరగని కుక్కపిల్ల తో నేమి గృహ రక్షణము జరుగును? నురుగు రాని సబు బిళ్ళ తనేమి వస్త్ర మాలిన్యము దూరము చేయ గలుగును?
అట్లే అసమర్థులైన ప్రభుత్వాధినేతలు లోకమునకేమి మార్గ దర్శకులగుదురు? ఏమి దేశ రక్షణము చేయ గలరు? దేశమాలిన్యము నేమి కడిగి వేయ గలరు? అని వ్యంగ్యముగా విమర్శించినటులైనది .ఇది ఉత్తమ కవి లక్షణము గదా !.మొదటి కావ్య కవితయే ఈతనిదింత ఘాటుగా నున్న మును ముందు గడతేరిన ఇతను కవితా లేఖనము అత్యంత ప్రౌఢత నాకళించుకొని సహృదయ హృదయా వర్జకముగానుండు ననుట లెంతయు వాస్తవము.ఇట్లే దేశీయుడైన సోదర మానవుని “” బ్రదర్”” గా సంబోధించి ప్రగతి శీల వర్తనము నుపదేశించు వైతాళికుడీ కవి యనుటలో విప్రతిపత్తి లేదు. ఇతనికి మును ముందు మహోన్నత కావ్య పంథాలలో విహరించు ఆత్మ శక్తిని ప్రసాదించి ధర్మపురికేకాక యావదాంధ్రకు కీర్తి నిచ్చు చక్కని కవివరునిగా నొనరించు ఆయురారోగ్య విద్యావిజ్ఞానముల ప్రసాదించ ధర్మపురి నరసింహుని ప్రార్థింతు- -ఇతిశమ్

“ అభినవపోతన , విద్యావచస్పతి ”
డా|| శ్రీమాన్ వనమామలై వరదాచార్యులు తేదీ:13-01-1982. చెన్నూరు: ఆదిలాబాదు(జిల్లా) (ఆం.ప్ర.)

చెప్పనవసరం లేని మాట
ఛందో బంధోబస్తులనుండి భావ దారిద్ర్యపు ఇనుప పంజరాల నుండి స్వేఛ్ఛ నిస్తూ వచన కవులు ఎగురవేసిన వచన కవితా కపోతం జవం తరిగి రెక్కలు విరిగి నేలకు ఒరిగేలాఉంది. “ నియతలేని స్వేఛ్ఛ నిప్పుతో చెర్లాట “ గా మారింది . కవిత్వానికి ఉండవలసిన ప్రాథమిక లక్ష్యం దెబ్బతింది. భావమే కవిత్వమని , లేదా అబిప్రాయ ప్రకటన మాత్రమే కవిత్వమని ఒక దురభిప్రాయం ఏర్పడే స్థితి దాపురించింది. కవిత్వం అనుభూతికి విడాకులిచ్చింది. “ అర్థాలు గదిలో విడిచి వ్యాహళికేగు శబ్దావళులు కవిత్వం అయ్యాయి.
కవి సమ్మేళనాల్లో ఒకటో రెండో కవితలు చదివి , పది కవితలు రాయగానే పురిటిలోనే అచ్చుబోసి ఆబోతుల్లా దేశం మీదికి వదిలేస్తున్నారు, నేటి కవులు.
ఉక్తిచమత్కృతి కవిత్వానికి ప్రాణం. ఈ లక్షణం సాధారణమైన మాటలనుండి కవిత్వాన్ని వేరు పరుస్తుంది. ఉదాహరణకు “ నిజం చెప్తే నేరమవుతుంది “ అనే మాటను రెండురెళ్ళు నాలుగంటే జైళ్ళు నోళ్ళు తెఱిచే చోటు “ అంటే ఆహ్లాదం కలుగుతుంది. ఐతే కవికి బలమైన సామాజిక స్పృహ తోటి సామజిక చైతన్యమే లక్ష్యంగా రచనలు చేసే శక్తి ఉన్నప్పుడే ఆ కవి కవిగా నిలబడగలుగుతాడు.
మాత్రా ఛందస్సులతోటి ఈ శతకం రాయలేదంటూ చెప్తున్న ఈకవి తాను రాసిన కవితలు గతిని అక్కడక్కడా నిరూపిస్తున్నా వచన కవితే అంటున్నాడు.వచన కవిత్వపు శతకమైన ఈ పుస్తకం ప్రక్రియలో కొత్తదైనా ఇంకా స్పష్టమైన రూపంలో లేదు. ఇంట్లో ఏం మాట్లాడినా పది మంది కూర్చున్న సభలో మాట్లాడేటప్పుడు జంకు పుడుతుంది.కారణం తన మాట జనంలోకి పోతున్నదని తాను బాధ్యతా యుతంగా ప్రవర్తించాలని భావించడమే. అలాగే ముగ్గురు నలుగురు శ్రోతల నడుమ కూర్చున్న కవికి తన కావ్యం అచ్చువేసి జనంలోకి పంపుతున్నప్పుడు కూడ ఇదే జంకు అవసరం.ఇంకా పొదగకముందే గుడ్డును తొందర పడి చితక గొట్టుతున్నావని నేనీ కవికి చెప్పినప్పుడు అతనిలో తన పుస్తకం అచ్చుకావాలనే తపననే బాగా గోచరించినది. ఇది ఏ కవికైనా సహజమే, మంచిదే! రాఖీకి తన లోతు తాను తెలుసుకొనే అవకాశం వచ్చింది.
“అడుగుకో దేవుడు అవతరించె, గడపకో బాబా దర్శన మిచ్చె “ వంటి సామాజిక రుగ్మతల చిత్రణం ,” ప్రతి కవి కథనం లో సాంతం ప్రతి బింబించును జీవితం “ వంటి సత్యాలు చెప్పడంతో బాటు , “ చెప్పేద్దాం ప్రయత్నాలకి ఉద్వాసనలు , దొరకవు మనకిక యే ఉద్యోగాలు మొదలెడదాం మరి ఉద్యమాలు “ వంటి నిస్పృహ లోంచి పుట్టిన వెలుగు జిలుగులు కూడా విరజిమ్ము తున్నాడు.
అయితే “ వంతావార్పూ వస్తేనే వనిత “ లాంటి సూక్తులు “ శివ శివ అనుకొంటే అది భక్తి , హరి హరి అంటే పొందేవు ముక్తి , శ్రీ శ్రీ మాట వింటే యువత కు శక్తి “ వంటి పంక్తుల్లో ఉత్తర దక్షిణ ధృవాలను కలుప జూసే భావ వైషమ్యత కవి అపరిపక్వతను సూచిస్తున్నయి.
“ కులాలు జనతను కూల్చివేసు , మతాలు మనిషిని మంట గలుపు “ వంటి వాస్తవాలు చిత్రించ గలిగిన ఈ కవి తనలోని ప్రతిభకు మెరుగులు పెట్టుకొని ఇంతకంటె చక్కని కవిత భవిష్యత్తులో అందిస్తాడని ఆశిద్దాం-
సంగనభట్ల నర్సయ్య
ప్రిన్సిపాల్
శ్రీ లక్ష్మి నృసింహ సంస్కృతాంధ్ర కళాశాల 15-01-1983 ధర్మపురి,కరీంనగర్ (జిల్లా) (ఆం.ప్ర.)








రాఖీ పలుకులు
నేను చూచిన లోకం బహు తక్కువ
కాని చెప్పేను తోచిన దాన్ని ఎక్కువ
మనిషిమనుగడయే నా మక్కువ
నిక్కముర నామాట వినుకోర బ్రదర్!

ప్రతి కవి కథనం లో సాంతం
ప్రతిబింబించును జీవితం
పత్రికల్లో అది ప్రచురితం
ఇలలోని సంగతులు ఇంతేర బ్రదర్!

వానమామలై వరదాచార్యులు
కవితానదీ వరదాచార్యులు
ఉత్ప్రేక్ష సరదా చార్యులు
“అభినవ పోతన బిరుదాచార్యులు బ్రదర్!

ప్రాసకు దాసులమైనా
భాషకు బంధీలమైనా
కాసులకే కవిత చెప్పినా
భావం చెడనీకు ఓ పిచ్చి బ్రదర్!
ఎందరో మహాను భావులు......................!
“ధనమేరా అన్నిటికీ మూలం” అన్న నిజం ప్రకారం ఈ పుస్తకం లోకాన్ని చూడాలన్నా లోకం ఈ పుస్తకాన్ని ఇలా చూడాలన్నా డబ్బు అవసరం.నా మీద ఉన్న అభిమానంతో 500/- రూపాయలు సహాయమొనర్చిన మా రాజత్త హన్మంతు మామలకు అట్లే ప్రేమతో 500/- రూపాయలు ఇచ్చిన మా బాపు గొల్లపెల్లి చిన్న హన్మాండ్లు ఆయి రత్తమ్మలకు నా ధన్యవాదాలు.
ఈ పుస్తకానికి ’ముందుమాట’ వ్రాసి ఇచ్చి ఈ పుస్తక ప్రచురణకై ప్రోత్సాహాన్ని కలుగజేసి నాలోని ’జంకు ’ ను దూరం చేసిన “అభినవ పోతన శ్రీమాన్ వానమామలై వరదాచార్యుల
వారికి నా కృతజ్ఞతాంజలులు.
చెప్పనవసరం లేదంటూ ఎంతో చెప్తూ నా కవితలోని లోటు పాట్లను నిస్పక్షపాతంగా ఎత్తి చూపుతూ నా ప్రగతికి దోహదం చేస్తున్న సోదరతుల్యులు శ్రీ సంగనభట్ల నర్సయ్య ప్రిన్సిపాల్ గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.
తగిన సలహా సహకారముల నొసగినటువంటి “ చిత్రిక “పురాణం రామచంద్ర “ గారికి , సుధాశ్రీ గారికి నా కృతజ్ఞతాభి వందనములు.
అందంగా అచ్చుతప్పులు లేకుండా ప్రచురించి ఇచ్చిన ’నటరాజ్ ప్రింటర్స్ ’ వరంగల్ వారికి నా ధన్యవాదాలు.
ఈ చిన్ని పుస్తక ప్రచురణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలు పంచుకొని సహాయ సహకారాలను అందించిన “ ఎందరో మహాను భావులు! అందరికీ వందనాలు!! “

మీ
రాఖీ


అంకితం
నాలోని
కవితను
ప్రోత్సహించి
ప్రగతి దారుల
పయనింపజేసిన
సుప్రసిద్ధ పౌరాణికులు
ఖ్యాతినొందిన కళాకారులు
బ్ర|| శ్రీ కాకర్ల లక్ష్మీ కాంత శాస్త్రి
తాతగారికి
భక్తితో
-రాఖీ

*******రచనా కాలం 1980-1982 అని గమనించ గోరుతాను********
నిర్వచనాలు
1. అ(Up)ప్పిచ్చువాడె అసలైన వైద్యుడు
చెప్పులపై చిత్తమున్న సిసలైన భక్తుడు
ట్యూషన్లు చెప్పువాడె నిజమైన టీచరు
ఇలలోని నిజమిదిర వినుకోర బ్రదర్!

2. సిగ్గు విడిచిన వాడు సినీస్టారు
బుద్దిలేనివాడు విద్యామినిష్టరు
ఒకరిద్దరినైన చంపువాడె డాక్టరు
వినుకోర నామాట విశదముగ బ్రదర్!

3. అరవై ఏళ్ళుంటేనె సినిమా హీరో
ఇరవై పళ్ళూడితే పొలిటికల్ బ్యూరో
యువతస్థానం అన్నిటా జీరో
ఇలలోని నిజమిదిర వినుకోర బ్రదర్!

4. ఆరడుగులున్నవాడె ఆడపిల్లకు హీరో
కల్గియుండాలి అతడు కనీసం ఏ ఫియట్ కారో
తాగుతూ ఉండాలి ఎపుడూ విస్కీయో బీరో
కలికాలపురీతి నేమందు గదరా బ్రదర్!

5. వంటావార్పూ వస్తేనే వనిత
కంతనీరొలిపితే కలదు మమత
పంటాపైరు నిలిస్తె లేదు మనకి కొఱత
వినుకోర నామాట విశదముగ బ్రదర్!

6. శివశివ అనుకొంటే అది భక్తి
హరిహరి అంటే పొందేవు ముక్తి
శ్రీశ్రీ మాటవింటే యువతకు శక్తి
వినుకోర నామాట విశదముగ బ్రదర్!
7. ఉద్యోగం పురుష లక్షణం
వియోగం విరహ లక్షణం
వివాదం వనిత లక్షణం
ఇలలోని నిజమిదిర వినుకోర బ్రదర్!

8. Tea కై చరించువాడు టీచరుడు
ఏకీలుకాకీలు పీకెవోడు వకీలు
మానము వదలినవాడె మానవుడు
ఎరిగిమెలగురా వెర్రి నా బ్రదర్!

9. లెగ్ ఫ్రాక్చర్ చేయించుకునెవోడు లెక్చరరు
పండ్లో దండ్లో ఇచ్చుకునెవోడు కండక్టరు
ప్రాజెక్టు ఒకటైన కూల్చినోడె కాంట్రాక్టరు
ఎరిగిమెలగురా వెర్రి నా బ్రదర్!

10. ఓర్పు గలవాడె భువిని ఉత్తముడు
అహంకారమున్నవాడు మధ్యముడు
అవహేళనము జేయువాడు అధముడు
ఎరిగిమెలగురా వెర్రి నా బ్రదర్!

11. చుక్కలేనిదె బుక్క మింగనివాడు
చుక్క రానిదె పక్కజేరని రేడు
చక్కని వాగ్దానాలు నినాదాలిచ్చువాడు
పక్కానాయకుడు గదరా బ్రదర్!
నిరర్థకాలు
12. అక్కరకు రాని చదువు
కైపెక్కించగ లేని మధువు
నచ్చీనచ్చని వధువు
నిక్కముగ ఒక్కతీరె గదరా బ్రదర్!

13. వెలగని అగ్గిపుల్ల
మొఱగని కుక్కపిల్ల
నురుగురాని సబ్బుబిళ్ళ
నిక్కముగనొక్కతీరె గదరా బ్రదర్!

14. దుర్మార్గుడు చెప్పునీతి
పట్టపగలు కలుగు భీతి
సిగరెట్ పెట్టెమీది
’హెల్త్ కాషన్ రీతి కదరా బ్రదర్!

15. తొణికిన స్వప్నం
పగిలిన అద్దం
రగిలిన హృదయం
నిక్కముగ నొక్కతీరె గదరా బ్రదర్!

16. అ’హింస’ లో హింస ఉంది
అ’సత్యం’ లో సత్యముంది
నందియె పంది నేడు పందియె నంది
ధర్మ సూక్ష్మమిది ధరలోన బ్రదర్!

వాస్తవాలు-నీతి
17. ఎలక్షన్లు రాగానే వత్తురు నాయకుల్
ఎలక్ట్రిక్ బల్బులతొ వెల్గును మీ వీథుల్
ఎలకలన్ని కట్టాలి పిల్లి మెడలొ గంటల్
వినుకోర నామాట విశదముగ బ్రదర్!

18. శంకుస్థాపన జరిపి నేటికి పదో ఉగాది
ఫాక్టరీ స్థాపనకు వెలిసె నేడె పునాది
పాతికేళ్ళపిదప పక్కనే మంత్రిగారి సమాధి
’పాడె’య్యర చరమ గీతి ఫాక్టరీకి బ్రదర్!


19. ఏ కళాశాల లోనైనా క్రికెట్ కామెంటరే
ఆహా( ! ఆఫీసుల్లోకూడా అదే వింటారే
దానికై ఎంతపనున్నా సరే మాను కొంటారే
క్రికెటె జీవితమాయె నేడు గదరా బ్రదర్!

20. ప్రాణంతీస్తోందయా రా(ఆ)కాశవాణి
ప్రతి ఇంట్లో అది పట్టపు రాణి
భరించలేమిక దాని వాణిజ్యధోరణి
హత్యచేయర ఆలసింపక అరివీర బ్రదర్!

21. దూడతప్పిన కేసులు నాలుగు
ఆక్సిడెంట్లు చావులు మరో ఆరు
అడ్వర్టైజ్ మెంట్లు పేజికో పదారు
దిన పత్రికల దుస్తినేమందు బ్రదర్!

22. ఏ అడ్వర్టైజ్ చూసినా శ్రీ సినీ తారే
షేవింగ్ మిషనైనా సరె ఆమె పేరే
అయారే సినీ తారల స్థితి ఎంతదిగజారే
హరిహరీ వారినేమందు గదరా బ్రదర్!
23. నిన్నటి శంకరాభరణం
సినీవాకిట మంగళతోరణం
కళామతల్లికి కంఠాభరణం
ప్రణుతించ పదములె కరువాయె బ్రదర్!

24. తీసిన ప్రతి సిన్మా హిట్ కాదు
రాసిన నవలల్లా పోటీ గెలవదు
చూసిన ప్రతి ఆడదీ బ్యూటీ గా ఉండదు
పట్టిందల్లా బంగారంకాదు కాదు పిచ్చి బ్రదర్!

25. సిన్మాటాకీసుల్లో సిగరెట్టు పీకలు
పోస్టాఫీసుల్లో పంచబదని జాబులు
సిటీ బస్సుల్లో cut ఐన జేబులు
నిక్కముగ లెక్కలేదు గదరా బ్రదర్!

26. సెక్స్ సినిమాలు తెగచూసి చూసి
బూతునవలలు బాగ చదివి చదివి
రాతల్లొ సామెతల్ని మార్చివేసితివి
’బూతుమయం జగతని ’బుచ్చి బ్రదర్!
27. అడుగుకో దేవుడు అవతరించె
గడపకో బాబా దర్శన మిచ్చె
మనిషికో *“సిద్దేశ్వరీయు” వెలిసె
ప్రతిమనిషీ దైవమె గద మహిలో బ్రదర్!
(*తులసి నవలలో లాగ)
28. ఇందులేదు ఎందుగలదని
సందేహమె వలదు వలదు
ఎందెందు కోర అందే అగుపించు
సర్వాంతర్యామిరా ’కల్తీ’ చిట్టి బ్రదర్!

29. ప్రజాసేవయే ప్రథమ కర్తవ్యమని
బజారున పడ్డాయి బడాయి బస్సులు
నిజానికి ఆర్టీసికి అర్పించాలి జోహారు
ఆదర్శసంస్థ మనకది కదరా బ్రదర్!

30. ఏ సరకున ఎంత దోచినా
ఏ బ్యాంకున ఎంత దాచినా
పేదోడి రక్తమది ప్రాణం తీస్తుంది
వద్దు వద్దురా దోపిడి వర్తక బ్రదర్!

31. రక్షక భటుల పనియె రక్షణ
వారికి లేదేమో సరియగు శిక్షణ
అచటచట చూస్తాము వారి భక్షణ
“కంచే చేను మేసినట్లు “ కదరా బ్రదర్!

32. పోలీస్ స్టేషన్ లో మాన భంగాలు
పొలిటీషియన్లకి శృంగ భంగాలు
ప్రగతి విక్ర మార్కుడికి మౌన భంగాలు
భేతాళ లీలలు తాళలేము బ్రదర్!

33. ప్రభుత్వాసుపత్రుల్లో
పనికొచ్చు మందుమాత్రలు
ప్రముఖ వైద్యమిత్రులు
’నేతి బీరకాయ రీతి’ గదరా బ్రదర్!

34. భారతీయునిగ బ్రతుకు వద్దు
ఆడపిల్ల తండ్రిగ అసలు వద్దు
మానవతలేని మనిషిగ జన్మే వద్దు
దైవాన్ని కోరేది ఇదిరా బ్రదర్!

35. మొహమ్మీద చెప్పువాడు మంచి మిత్రుడు
పొగిడెవాడె ఎపుడొ పొడిచివేస్తాడు
ఘాటైనదైనా శొంఠి రోగాన్ని చంపు
ఎరిగి మెలగురా వెర్రినా బ్రదర్!

36. అపకారికి ఉపకారము చేయమంది నానుడి
ఉపకారికి అపకారము వద్దంది న్యూనుడి
ఇది అభ్యుదయ కవి ఆరుద్ర అన్నట్టు వినికిడి
వినుకోర నామాట విసదముగ బ్రదర్!

37. ఇరవై సూత్రాల పథకంతో
దేశపురోగతి తథ్యం తథ్యం
అమల్పరచడంలో ఉంది అసలు సామర్థ్యం
నిక్కముర నామాట వినవేర బ్రదర్!

38. దున్నేవాడిదె భూమి
హలమే వాడికి భాగస్వామి
బలముంటేసరి వాడే భూస్వామి
వినుకోర నామాట విశదముగ బ్రదర్!
39. దేశానికి కర్షక శ్రామిక సైనికులే
దేహానికి గాలీ నీరూ ఆహారములవలె
ప్రగతి భవంతి పునాది రాళ్ళై
జగతిన ఖ్యాతిని నిలపాలి బ్రదర్!

40. ఇద్దరు లేక ముగ్గురు నిన్నటి కథ
ఒక్కరో ఇద్దరో సరి ఈనాటి మాట
ఒక్కరితో ఆపమని రేపటి రొద
అందుకే ’శుభస్య శ్రీఘ్రం’ కదరా బ్రదర్!

41. వరకట్ననిర్మూలనం
వేదికపై ఉపన్యాసం
వల్లకాటిలో వైరాగ్యం
నిక్కముగనొక్కతీరె గదరా బ్రదర్!

42. అసమర్థుడి భార్య అందరికీ లోకువే
అసమర్థులందరూ పనిలేని లోకులే
లోకులంతా కూసే పిచ్చికాకులే
పిచ్చికాకుల గోల మనకొద్దు బ్రదర్!

43. అందాల భార్య ఉండ వేశ్యా సంగమమేల?
ఇంట కమ్మని టిఫినుండ హోటల్ పోవనేల?
చదువ మంచి Book ఉన్న చెడు స్నేహాలేల?
రాజ మార్గముండ దొడ్డిదారి ఏల గదరా బ్రదర్!

44. విచ్చిపోతుంది అందమైన దైనా గులాబి
చంపివేస్తుంది మధురమైన దైనా शराब
నిద్రలేస్తుంది యువతరం अभी अभी
ఎరిగి మెలగురా వెర్రినా బ్రదర్!

45. ఎందరో అందాల దుర్మార్గులూ
అందరికీ మంచోళ్ల వందనాలు
మీతోటె వచ్చిందాళ్లకి మంచిపేరు
పాపం దుర్మార్గులె మంచోళ్లు గదరా బ్రదర్!

46. స్మోకింగ్ ఈ నాడు షోకింగు
తాగితే తాగాలి ఒకసారి భంగు
మంచిమిత్రుడు కదా మనకి గ్యాంబ్లింగు
లోకమేమైన మనకేమి గదరా బ్రదర్!

47. దీపం క్రిందే చిరు చీకటి
పుణ్యానికి పోతె వచ్చు పాపమొకటి
న్యాయస్థానాల్లో అన్యాయాలు పరిపాటి
మున్సిపాల్టి చెంత ముర్కి కాల్వవోలె బ్రదర్!

48. చెప్పేద్దాం ప్రయత్నాలకి ఉద్వాసనలు
దొరకవు మనకిక యే ఉద్యోగాలు
మొదలెడదాం మరి ఉద్యమాలు
ప్రజ సేవకై పదవులెక్కుదాం గదరా బ్రదర్!

49. ఇంటర్వ్యూకి కావాలి మంత్రిగారి ఉత్తరం
ఇంటిలో ఇచ్చుకోవాలి కొంత దక్షిణం
రెంటికి చెడితివా ఇక తూర్పే నీకు శరణం
వినుకోర నామాట విశదముగ బ్రదర్!

50. ప్రజాకవి మనసినారె
నిజానికి నింగిలో తారే
ఆయన్నెవరూ అందుకోరే
ఎగిరి చూడర ఓ మారు వెర్రి బ్రదర్!

51. ఆంధ్రుడెప్పుడు కోరు ఆవకాయ గోంగూర
తమిళుండు గ్రోలు ఇడ్లీ సాంబారు
నార్తిండియన్ కి రొట్టెనె రైస్ తీరు
వినుకోర నామాట విశదముగ బ్రదర్!

52. ఆంధ్రదేశానికి అది అందాల నగరం
ఆ మాటకొస్తే అది భూతల స్వర్గం
వీథులు మాత్రం దుర్వాసనా భరితం
అనుభవించర ఓ మారు యంగ్ బ్రదర్!

53. నగరవాసము నరక తుల్యము
పల్లెసీమయె భువిని స్వర్గము
ఎయిర్ కూలర్ కన్న చెట్టు నీడ మేలు
ఎరిగి మెలగురా వెర్రినా బ్రదర్!

54. అతిథులంటే సిటీ వాళ్ళకి భయం
పల్లెవాసులె వాళ్ల కంటె నయం
అయినా సిటీయే నాగరికతా నిలయం
ఇలలోని నిజమిదిర వినుకోర బ్రదర్!

55. వీథివీథికి వెలిసె పానుషాపు
ప్రతిబజారున ఓ బీరు షాపు
ఆ ప్రక్కనె అగుపించు హోటల్ రూపు
నాగరికత నడిబొడ్డున నాట్యమాడు బ్రదర్!

56. మనమంతా దేశవాసులం
మనలో కొంత భాషాద్వేషులం
మరికొంత కులమత దాసులం
అయినా సమతావాదులం గదరా బ్రదర్!

57. అప్పుచెప్పులరీతి నిక్కముగ నొకతీరు
చూడచూడ వాటి గతులు వేరు
పెరుగునవి అప్పులు అరుగునవి చెప్పులు
ఇలలోని సంగతులు వింతేర బ్రదర్!

58. కుడిపాపం ఎడమయ్యింది
ఎడమ ఎక్కడికో వెళ్లిపోయింది
దేవదాసు పెళ్లి జరిగి పోయింది
తెల్లవారె నింతలో ఓ చిట్తి బ్రదర్!

59. ప్చ్! వందే మా తరం
హు( అందు అందరం నేతలం
పెంపొందు మాతో దేశబలం?
చెబితె వినవేర చిట్టి బ్రదర్!

60. వాహనమునకు ఇందనం అవసరం
విగ్రహమునకు చందనం అలంకారం
గౌరవమునకు వందనం ఆచారం
ఎరిగి మెలగురా వెర్రి నా బ్రదర్!
61. రేపు పరీక్షయన రేయంత చదివేవు
చదివిన వాటిల్లొ సగము మరిచేవు
ఫలితాలు తెలుసుకొని బావురు మంటావు
దప్పిగొన్నప్పుడె బావి త్రవ్వుకొందువ బ్రదర్!

62. ఇంజనీరింగ్ సీటుకు ఇరవై ఐదు వేలు
వైద్యుడగుటకు విదేశాల కేగు
డాక్టరేటుకు ప్రొఫెసర్ దయాభిక్ష కోరు
వినుకోర నామాట విశదముగ బ్రదర్!

63. మంత్రి మారితే చాలు
మారేవిద్యా విధానాలు
నిరసిస్తే జరుగు మేలు
వినుకోర నామాట విశదముగ బ్రదర్!

64. ట్యూషన్లు ఉపాధ్యాయుల పాలు
పై క్లాసు ప్రమోషన్లు విద్యార్థులకు చాలు
డొనేషన్లు విద్యాసంస్థలకు “వేలు”
ఎలక్షన్లు నాయకులకు మేలు కదరా బ్రదర్!

65. దేవాలయాల్లొ చోరులె గలరు
సచివాలయల్లొ సన్నాసులున్నారు
విద్యాలయాల్లొ ప్రబుద్ధులున్నారు
కలికాలపు రీతి నేమందు బ్రదర్!

66. చదివితే చదవాలి యద్ధనపూడి నవల
చూస్తే చూడాలి అక్కినేని నటన
నడిస్తే నడవాలి జయసుధ సరసన
యువతరం కోరేది ఇదిరా బ్రదర్!

67. పెండ్లి చూపుల జోరు
పండ్ల బేరము తీరు
పదిమంది కల్సి పరిశీలించేరు
ప్రతిసారి ఆమె అంగడి బొమ్మనె బ్రదర్!

68. అబ్బాయి అయితె చాలు పదివేలు
పది పాసవుతె మరి మేలు అయిదు మూళ్లు
సంత పశువే ఎంతో మేలు మేలు
వింతకాదిది నిజమురా వెర్రి బ్రదర్!

69. భోజనం లో ఉప్పు
పడుచుపిల్లకు కొప్పు
సగటు మనిషికి అప్పు
ఎక్కువైతే ముప్పు కదరా బ్రదర్!

70. వాళ్ళు చేసేది వియ్యాలు
పెళ్ళిలోనే ఎదురౌను కయ్యాలు
విత్తమువద్ద నే వివాదాలు
మన బ్రతుకులు మారేవి మరి ఎప్డు బ్రదర్!

71. అంతరిక్షంబునకు నెగసె
అంబుధియందును జొచ్చె
పరమాణువునె పగలగొట్టె కాని
మానవతనె మరిచె మనిషి మహిలోబ్రదర్!

72. కులాలు జనతను కూల్చివేసు
మతాలు మనిషిని మంటగలుపు
కలిసి ఉంటెనె కలిమి గలుగు
పాత భావాలు విడువురా పిచ్చి బ్రదర్!

73. లంచం
మట్టి కంచం
కుక్కి మంచం
లేని ప్రపంచం లేదు కదరా బ్రదర్!

74. గుమ్మడి కాయల దొంగంటే
భుజాలు తడుముకొనే తీరు
దమ్మిడీకి కొరగావంటే
జేబులు వెతకకు బ్రదర్!

75. మరచి పోవడం మా జన్మహక్కు
అరచి చావడం మరి మాకె దక్కు
ఎపుడు ఏడ్చె వాడికెవడు దిక్కు
మరువకుర నామాట మదిలోన బ్రదర్!

76. చావాలని పోయాడు నాలాంటివాడు
ఊగేటప్పటికి తెగింది ఉరిత్రాడు
నదిలోదిగితే నడుంవరకే మునిగేడు
కాలదోషము నేమందు గదరా బ్రదర్!

77. ఓర్పుకు మారు పేరు ధరిత్రి
వెన్నెముకనే ఇచ్చె దధీచి
ప్రాణముల్ గొనితెచ్చె సావిత్రి
కథలనీతి గొనవేర వెర్రి బ్రదర్!

78. నాకు తెలియదు దైవానికి నిర్వచనం
తెల్సిందొక్కటె అది ఒక శక్తి స్వరూపం
చేయాల్సింది మరొకటి ఏకాగ్రతాభ్యాసం
దారులు వేరైన గమ్యమొకటె గదరా బ్రదర్!

79. చెప్పెదొక్కటి చేసెదొక్కటి
తప్పుఒప్పుల రూపు ఒక్కటి
పోలికేలేక పొలికేక పెట్టి
’కాళికా’ యందువా చిట్టి బ్రదర్!

80. కలలు జాగరణ వల్లరావు
ప్రేమకు నిరాకరణతోనె “చావు”
కళలు నిరాదరణతొ పెంపుకావు
ఎరిగిమెలగురా వెర్రి బ్రదర్!

81. హద్దులెరుగుతూ ఉండమంటావు
వద్దు వద్దంటు నన్నువారిస్తావు
ప్రేమకు హద్దులె లేవురా
హద్దులుండేది ప్రేమకాదురా పిచ్చి బ్రదర్!

82. అందంగా ఉండటం దీపం తప్పా?
ఆకర్శింపబడటం శలభం గొప్పా?
కాల్చివేసేటి జ్వాలదే ఒప్పా?
ఆలోచించుటె అసలు తప్పుర వెర్రి బ్రదర్!

83. పాటకు ప్రాణం పల్లవి
పాపకి అందం అల్లరి
మనిషికి ఆశే ఊపిరి
మరువకుర నా మాట మదిలో బ్రదర్!

84. భూతకాలం భూతం లా అవుపిస్తోంది
భవిష్యత్తు బెబ్బులిలా ఆవులిస్తోంది
వర్తమానం మనని వెక్కిరిస్తోంది
కాలదోషము నేమందు కదరా బ్రదర్!

85. నీ దారి ఎడారిగా మారితే
గ్రీష్మఋతువు హేమంతమైతే
కన్నీళ్లతో దప్పిక తీర్చుకో
ఆకలి మంటతొ చలికాచుకో

86. నీ వెనకగ నుయ్యెవరో త్రవ్వితే
నీ ముందొక గొయ్యే ఎదురైతే
ఈత వచ్చి ఉంటే నూతిని ఎంచుకో
చేతకాకుంటే గోతినే ఎన్నుకో బ్రదర్!

87. ప్రవర్తింతురు కొందరు పైశాచికరీతి
ఒకరిని బాధించడమే వారికి ప్రీతి
ఎపుడు మారునో వారి జీవన గతి
ఎరుగలేకున్నామురా వెర్రి బ్రదర్!

88. వ్యక్తిగతంగా ప్రతి మనిషి ఎంతో మంచి
సమాజంలో చేరాడా శృతి తప్పిన విపంచి
ఇక చేరలేదు ఎపుడూ వాడి కథ కంచి
ఇలలోని నిజమిదిర వినుకోర బ్రదర్!

89. కలకూ ఇలకూ కడుదూరం
మనిషికి మనసే బహుభారం
ప్రపంచమొక అందాల పంజరం
వేదాంతసార మింతేర బ్రదర్!

90. జీవితమే విషవలయం
ఆశే దానికి నిలయం
కోరికలే గుర్రాలైతే ప్రళయం
వినుకోర నామాట విశదముగ బ్రదర్!

91. విషం దగ్గరుంటే ప్రేమించు
ప్రేమే ఆశను పెంచు
ఆశను విషంగా బావించు
భావనయే బ్రతుకురా బుచ్చి బ్రదర్!

92. ప్రేమించడం పొరపాటు
పొరపాటులే మనకలవాటు
అలవాటులే మనపాల్టి గ్రహపాటు
చిత్తగించవేర చిట్టి బ్రదర్!

93. ధనం ఉంటే దాచుకో
రోగముంటే చెప్పుకో
ప్రేమించకు చచ్చిపో
మరువకుర నామాట మదిలోన బ్రదర్!

94. ప్రేమించగానే పెళ్ళికాదుర
ప్రేమ పెళ్ళీ వేరు వేరుర
సంఘమంటే వేరె లేదుర
సంఘమంటే నీవునేనుర చిట్టి బ్రదర్!

95. తనను ప్రేమించే వాడికన్న
తాను ప్రేమించే వాడితో నున్న
సుఖము కాదు తాను పొందునది సున్న
విప్పిజెప్పవేర వెర్రి బ్రదర్!

96. ఫలించకుంటేనే ప్రేమ
అయినా చలించనిదే అందాల భామ
నిద్ర పట్టించనిదే దోమ
వినుకోర నా మాట విశదముగ బ్రదర్!

97. ఆశ ఉంటే ఫరవాలేదు
ఆశయాలకి కరువా ! లేదు
ఆలోచనలకి అంతం లేదు
ఈ నాటి మనబ్రతుకు లింతేర బ్రదర్!

98. అతిగా ఎవర్నీ నమ్మకు
బ్రతుకంతా చెప్పకు
మనస్సుమాత్రం విప్పకు
మరువకు నామాట మదిలో బ్రదర్!

99. తప్పుచేస్తే ఒక నేరం
సమర్థిస్తే అది మహాఘోరం
తిరిగి చేయకుండుటయె పరిహారం
వినుకోర నామాట విశదముగ బ్రదర్!

100. విప్లవశంఖం పూరించు
ఒక్కొక్కరినే జోడించు
తెలుగు దేశాన్ని నడిపించు
విజయం నీదిర వినరా బ్రదర్!

101. ఏ విద్దె నేర్చినా ఏ ముద్ద మెక్కినా
ఏ మిద్దె చేర్చినా ఏ గద్దె ఎక్కినా
పోవద్దు పోవద్దు మరచి పోవద్దు
మానవత్వము నీవు మరువొద్దు బ్రదర్!

102. న్యాయాన్ని ధర్మాన్ని విడనాడి యైనా
జతగాడు అయినా పగవాడు అయినా
ఆపద యందున్న ఆదుకోవలె గాని
మానవత్వము నీవు మరువొద్దు బ్రదర్!

103. మంచతనమన్న మనసొత్తు కాదు
చెడ్డ వానిలొ కూడ కలదు మంచి
వెదకి చూచిన గాని వెలికిరాదు గాన
మానవత్వము నీవు మరువొద్దు బ్రదర్!

104. పారిపోకోయి ఓయీ పిరికివాడా
తెరని కోర్కెల రేడ పిచ్చివాడ
మానవుడవు నీవు మనిషివోయి
మానవత్వము నీవు మరువొద్దు బ్రదర్!

105. ఆత్మహత్యకు నీవు పాల్పడెద వేల?
ఆరని జ్వాలలు నీలోన రగులుతున్నా
బ్రతికి చలార్చు నీ బడబాగ్ని గాని
మానవత్వము నీవు మరువొద్దు బ్రదర్!

106. కొనుగోలు కాకోయి కన్నెపిల్లకు నీవు
కట్నాలు కానుకలు నీకేల నోయి
కాళ్ళు చేతుల జిగువ నీకుండగా
మానవత్వము నీవు మరువొద్దు బ్రదర్!

107. నీతి నిజాయితులను విడువకన్న
నీవల్ల ఒకరన్న మారిరని విన్న
లేదు అంతకు మిన్న దేశమేమారునన్న
కాన మానవత్వము నీవు మరువొద్దు బ్రదర్!

108. నిజంనిజంగా చెబితే ఒప్పుకోదు జనం
అసహజత్వం అనేది నాలో లేని గుణం
బాధ కలిగించానా కోరేను క్షమాపణం
జనశ్రేయమే మన ధ్యేయమని మరవొద్దు బ్రదర్!

No comments: