Wednesday, February 20, 2019

బి.నర్సయ్య_ పెద్దపల్లి
9491041835 06-07-2009.
ప్రియమైన రాఖీ గారూ.....!

ధర్మపురి నరహరి శతకం -REVIEW


మీ ధర్మపురి నరహరి శతకం సాంతం చదివాను.మరొక్కసారి ధర్మపురి వీథుల్లో ,గోదావరి తీరాన విహరించిన అనుభూతి_’సిరివెన్నెల ’లో – ఈ గాలీ ఈ నేలా - పాటలా.
భక్తిరసానికి ఆధునికతను జోడించి తేలికైన పదాలతో మీ భావాల్ని, అనుభూతుల్ని సూటిగా ఆవిష్కరించారు.
పదప్రయోగంలో మీ విలక్షణత అనితర సాధ్యం, ఈ కావ్యానికి ప్రత్యేక ఆకర్షణ అదే! ఆభరణాల్లో కంసాలి రాళ్ళను పొదిగినట్లు పదాలను కూర్చి పద్యాలను మెరిపించే నైపుణ్యత మీలో ఉంది.
నాకు తోచిన రీతిలో _ఈ సంపుటిలో రెండు విభిన్న వస్తువు(content)లతో కూడిన పద్యాలున్నాయి.ఒకటి –ధర్మపురి నరహరిని స్తుతిస్తూ ,అనుగ్రహాన్ని ఆశిస్తూ ,ధర్మపురి క్షేత్ర ప్రత్యేకతల్ని వర్ణిస్తూ ఉన్న పద్యాలు , ఇవి భక్తిరస ప్రధానమైనవి ,వీటన్నింటికీ ’ధర్మపురి నరహరి ’ అన్న చివరి పాదం ,వాటిని సంపూర్ణం చేస్తుంది.
ఉదా|| 1 నుండి 40 దాకా పద్యాలు.
రెండో రకం- సమాజాన్ని సరిదిద్దాలనే ఆకాంక్షతో దానిపై సంధించిన బాణాలు – మానవతా వాదానికి ప్రతీకలు, ఉదా|| 49 నుంచి దాదాపు మిగతావన్నీ.వీటికి ’దర్మపురి నరహరి ’ అన్నది అదనపు పంక్తియే.మొదటి మూడు పాదాలతో ఇవి నిక్కచ్చిగా నానీలే.మిగితావి ’నా’ ,’నీ’ లు కావచ్చు.
ఈ కాలం కవులు తమ సంపుటాలను ముఖచిత్రాల విషయంలో ,ముద్రణ విషయంలో Novelty కోరుకుంటున్నారు.దాని వల్ల Readers & Saleability పెరుగుతుంది.
నిరంతర పఠనం ద్వారా కవి మరింత ఉత్తమ కవిత్వాన్ని అందించగలడని ఓ పీఠిక లోఉంది. పేజీ 11 చివరి పంక్తి- నేటి కవులకు నాటి కవుల పఠనం అని ఉండాలేమో ....
భావ స్పష్టతతో పాటు భావ గర్భితం కవనాన్ని రసమయం చేస్తోంది. భావగర్భిత కావ్య సృష్టి అశేష ,విశేష కృషి దీక్షలతోనే సాధ్యం. అది ఓ తపఃఫలం .ఈ దిశలో పయనిస్తున్న నీవు మరింత సఫలీకృతుడివి కావాలని కాంక్షించే ఓ సాధారణ పాఠకున్ని నేను.

SANGEETHA GEETHA REVIEW

శబ్దం నిద్ర పుచ్చుతుంది
శబ్దం నిద్రలేపుతుంది
శబ్దం మనసును వెన్న ముద్ద చేస్తుంది
శబ్దం భయపెడుతుంది
ఆ శబ్దం సంగీతం గా రావచ్చు
గీతంగా రావచ్చు
శబ్దానికి భాష అర్థాన్నిస్తే
సరిగమలు ప్రాణం పోస్తాయి
“శబ్ద శిల” “సంగీత – గీత శిల్పం” గా మారిన వైనం
దాని మహత్తు, అది అలరించేతీరును అంశంగా తీసుకొని
మీరు సృజియించిన ఈ రచన నిరుపమానము!
సంగీత –గీత సారాన్ని ఆస్వాదించి జన్మ సుసంపన్నం చేసుకోమని, సరిగమలను శ్వాసిస్తే అవే జీవన వీణను సరి చేస్తాయని ప్రబోధిస్తోంది మీ సంగీత గీత.
కళలు టైంవేస్టు ,అనే పిచ్చోళ్లకు ’యంత్రానికైనా కావాలి ఒరాలింగు-రెస్టు’ – అనే సందేశం నేటి తరానికి లేహ్య సమానం.
“బ్రహ్మ కేటాయించిన శ్వాసల కోటా
ఎప్పుడయిపోతే అప్పుడే టాటా! “
ఎంత సింపుల్ గా జీవిత రహస్యం విప్పారు-అత్యద్భుతం!
“” టీవీ చూస్తే పని పాడే ,బెటర్ ఐపాడే , దానికదే పాడే “”
“పాడే” త్రిపాత్రాభినయం చేసింది
“” చింతకాయలు రాలాయా సంగీతమంటే అంతేమరి “”
కొత్త నడక!
రాళ్ళే కరిగినప్పుడు చింతకాయలు రాలకపోవడమేంటి?
“” ఫ్రీగా వస్తే దేనికైనా ఎగబడతాం
పుస్తకాలైతే మూలన బెడతాం “”
చెప్పును బట్టలో పెట్టి దవడ పై కొట్టినట్లుంది
Single concept పై రాసినా ఎక్కడా repetition పోవడం మీ ప్రతిభకు తార్కాణం!
ఈ రచన లో వ్యంగ్యం ఉంది.వేదాంతం ఉంది. లలిత కళలనాశ్రయించి జీవనకారడవిని నందనవనంగా మార్చుకోమని ఉద్బోధ ఉంది.
సమాజం పట్ల బాధ ఉంది. బాధ్యత ఉంది. ఎంత చెప్పినా బుద్దిరాదేం అని అక్రోశం ఉంది.
సప్తస్వరాల్లా ఏడు పరిచయ వాక్యాలున్నాయి.positive గా వివరణాత్మకంగా బాగున్నాయి. ఒకే school of thought కు సంబంధింనట్లున్నాయి.
రచనలో ఎలాంటి భాగస్వామ్యం లేని జీవిత భాగస్వామిని చివరి అట్టపై వామపక్షాన చేర్చుకోవడం- ఎల్లవేళలా గీతను పలవరించడమనుకోవాలా!
మీరన్నట్లు ఒకేరాత్రి ఇవన్నీ రాయడం నిజమైతే మీ ప్రతిభ అంచనాలకందనిదే!
ఈ ప్రతిభ మరిన్ని కవన రీతుల్లో భాసిల్లి మీరు పరిపూర్ణ కవిగా రాణించాలని నా ఆకాంక్ష _
_బి.నర్సయ్య.

Saturday, December 31, 2011

WISH U HAPPY NEW YEAR-2012

కనకమహాలక్ష్మి కాలి అందియల లయ
జ్ఞానభారతి కఛ్ఛపి వీణియ శ్రుతి కలయ
ఆదిపరాశక్తి ఖడ్గ కాంతులు వెలయ
మీ ఇల్లు విజయ దుందుభుల శబ్దాలయ కావాలని మనసారా కోరుకొంటూ_
మిత్రులకు,స్నేహపాత్రులకు,ప్రేమమూర్తులకు..ఆంగ్ల వత్సరాది శుభాకాంక్షలు!!

Thursday, October 27, 2011

ఆంధ్రులు ఆరంభ
శూరులు
ఋజువయ్యిందిగా
పలుమారులు!!

తెగిస్తేనే
తెలంగాణ
తెగేదాకా లాగితేనే
ఉంటుంది మనుగడ

ఇక “ఓదార్పు”
తెలంగాణా లో
జరిగింది మార్పు
జగనన్న పర్యటనలో...

వంతులవారీ
నకరాలు..
తెలంగాణ పోరుపేర
రాజకీయ నాటకాలు!

నాడైనాఎన్నడైనా
తెలంగాణ జనాలే
ఆంధ్రుల ముందు
బకరాలే!!

Saturday, September 24, 2011

సాదర ఆహ్వానము!

సాదర ఆహ్వానము!
ఈ రోజు(25-09-2011) కరినగర్ మాతా మహా శక్తి మందిరం లో
నా ఆడియో సి.డి.”దయామృతవర్షిణి”(మహాశక్తి భక్తి గీతాలు) ఆవిష్కరణ కలదు
అందరూ అహ్వానితులే! !సమయం:ఉదయం 10.00
_రాఖీ

Monday, June 13, 2011

అంతా నాదేననుకొంటే
లేదే చింత
అంతా నాకే అనుకొంటేనే
చిక్కంతా

ప్రేమించు
ఫరవాలేదు
అందరిపట్ల చూపించగలిగితే
ఏ ఢోకాలేదు

పార్టీకో పేపరు
సపోర్ట్ గా ఛానలు
ఏం కూసినా
ఆత్మస్తుతి-పరనింద!!

జనం పిచ్చోళ్ళే
తాన అంటే తందాన అంటారు
బుర్రలేకుండా
తందామంటారు!!

ఎదురీదే వాడి
కెన్ని దెబ్బలు!
సంస్కరిద్దామన్నప్పుడల్లా
పెడబొబ్బలు!!

మనమెలాగూ
ఎదిరించలేం!
ముందడుగేసినవారినీ
అభినందించలేం!!

వ్యక్తికాదు ముఖ్యం
వ్యవస్థ!
అన్నాహజారే , రాందేవులకూ
తప్పలేదవస్థ!!


విషయమొదిలి
అరుస్తారేల?
గుమ్మడి దొంగలయ్యీ
జబ్బ చరుస్తారేల??
చెలియలి కట్టుందని
సంబరపడకు
సునామి వస్తే
కడలి కడకు ?!

ముగ్గురి సీటు నల్గురిదైంది
స్నేహం పంచితే!
ఇద్దరికిరుకే
విస్మరిస్తే !!

కూడు గుడ్డా
నువ్వేసే భిక్షే కదా!
ఈ బతుకు
ఓ రైతు బిడ్డా!!

విత్తులెరువులెండ్రిన్లు
మద్దతు ధరలు
నిత్యం రణాలే!
చావుక్కారణాలే!!

థింక్ పాజిటివ్


రాజుగారి పెద్ద భార్య
పతివ్రత
మరి చిన్న భార్య
మహా పతివ్రత!!

గ్లాసులో సగం
నీళ్లు లేవనుకొంటే నిరాశ
సగమున్నాయనుకొంటే
ఆశ!!
అంతా నాదేననుకొంటే
లేదే చింత
అంతా నాకే అనుకొంటేనే
చిక్కంతా

Saturday, April 2, 2011

స్నేహితులకు ,బ్లాగు మిత్రులకు -వీక్షకులకు, కవితాభిమానులకు ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!!

ఈ“ఖర” ఆఖరా?!

ఈ“ఖర” ఆఖరా?!

కోయిలా కూయవేల? రాయిలా మౌనమేల?
ఉగాది రాలేదనా? రాదేలనా!
మామిడమ్మ చివురేయలేదనా, మల్లి చెల్లి పూయలేదనా
చింత కాయకుంటే ఎందుకంత చింత?
మన్మధుడు చెఱకును విల్లుకై ఎత్తుకెళ్లాడనా !
మమకారాలు కరువయ్యాయనా!
నీ పాట జనం మరి’చేద’య్యిందనా!
పర్యావరణముప్పు వల్ల కన్నీటి ఉప్పూ కరువయ్యిందనా!!
ఇది తెలంగాణాకు మరో దగాదనా
ప్రభుతకు దిగాదనా
వికీలీకులు- టుజీ స్కాంలు- నల్లధనాలు-కృష్ణ కమిటీ నయవంచనలు
పెట్రేగిన సెగాదనా
సునామీల అణుధారికతల అతలాకుతలమైన
జపనీయుల దుఃఖగాద మరి చేదనా
కాలాంతానికి ఈ “ఖర” ఆఖర నా


ఏ’దోనీ’ దయవల్లో సచినాడిన ప్రతిభ వల్లో
యువరాజు పటిమ వల్లో జహీర్ బంతి మెరుపులవల్లో
వీరలెవల్లో ఆడిన పరుగుల సెహవాగువల్లో ,
టీమిండియా పట్టుదలవల్లో శత ఏకవింశతి జనభారతి ప్రీతి వల్లో
సిక్సరుచుల తో,బౌండరీలతో ప్రపంచ టీములన్నిటినీ దంచి పచ్చడి చేసి
అందించిన ప్రపంచ క్రికెట్ ’కప్పు’ నీ ముందుంది.
అస్వాదించు ఆనందించు అది అందరికీ పంచు
అదే నీ మనోబలంపెంచు-విజయగానమిక వినిపించు

ఎందుకు నేస్తం?ఈ బేలతనం
పాడవే కోయిలా.. పాడుకో యిలా....
ప్రకృతికే నేస్తంలా..పాటే సమస్తంలా...
--రాఖీ---9849693324