గత ఉగాదుల స్వగతాలు
మాది తిరోగమనం-మాది సదా భ్రమణం
మా మనోరథానికి మేమే సారథులం!
మా ఇఛ్ఛా సామ్రాజ్యానికి మేమే సార్వభౌములం!!
మీరెవరు మాకు నీతులు చెప్పడానికి?
మీరెవరు మమ్మల్ని నిర్దేశించడానికి??
మాకు వాక్స్వాతంత్ర్యం ఉంది బూతులు పేల్తాం!
మాకు ఆస్తి హక్కుంది దేశాన్ని కొల్లగొడ్తాం!!
మీరెవరు అడ్డుకోడానికి-
మీరెవరు ఆపివేయడానికి-
మీ సొమ్మేంపోయింది గనక – దేశానిదే పోయె
మీకేం నొచ్చింది గనక- ఎవడి కడుపో కొడితె
అవును మేం పూదోటల్లో సమాధులు కడతాం
మేం నడి వీధుల్లో కాపురాలెడతాం
మీకేం నష్టం –మీకేం కష్టం
అవును మాకు మనిషికో ప్రత్యేక రాజ్యం కావాలి
అవును మాకు రోజుకో ప్రపంచ యుద్ధం రావాలి
మాకు ఇంటికో దేవుడు- గడపకో దేవత
రాముడు కృష్ణుడు ఏసు అల్లా
పోచమ్మ ఎల్లమ్మా గంగాలమ్మా అంకాలమ్మా
మాకు రాష్ట్రానికో మతం జిల్లాకో కులం
మండలానికో జాతి ఊరికో వర్గం మనిషికో తెగ
మనిషి మనిషికో భాష- మనసు మనసుకో ఆశ
మేం కన్నడులం మేం తెలుగోళ్ళం
మేం తమిళులం మేం బెంగాలీలం
మేం ఔత్తరాష్ట్రులం మేం దక్షిణాత్యులం
మేం బ్రాహ్మలం మేం వైశ్యులం
మేం మన్నెలం మేం మాదుగలం
మేం వెనబడ్డవాళ్ళం మేం వెనక బడాల్సినవాళ్ళం?!
మేం ఇలాగే కొట్టుక ఛస్తాం- మేం ఇలాగే అఘోరిస్తాం
మీకెందుకు మా సంగతి- మీ కెందుకు మా ప్రగతి?
మేం ఇంకా పుట్టల్లో పాలు పోస్తూనే ఉంటాం
ఎప్పటికీ చెట్టుకూ పిట్టకూ మొక్కుతూనే ఉంటాం
పక్కవాడు మమ్మల్ని దోచుకొంటే మాకేం అంతా దైవలీల అంటాం
తెలివైన వాడు మమ్మల్ని నిలువునా ముంచేస్తే మాత్రమేం
అది మా గ్రహచారం అంటాం
మేం దగా పడినా అదేదో వాస్తు దోషం అని సరిపెట్టుకొంటాం
అసలు ’మోసపోవడం’ అనేది మా జీవితం లో ఒకభాగంగా తలపోస్తాం
అయినా ఈ కథంతా మాకు సరిగ్గా తెలిసి ఛస్తే గద
అయినా మాకింతపాటి తెలివేడిస్తేగద
రిగ్గింగులు జరిగితేనేం-బర్నింగులు సాగుతేనేం
నడిరొడ్డులో మా బట్టలు ఊడదీస్తే నవ్వుతూ సహిస్తాం
ఉగ్రవాదులు మమ్మల్ని ఊచకోత కోస్తే హాయిగా భరిస్తాం
దేశం ఏ గంగలో దూకితే మాకేం
ప్రపంచం ఏ సంద్రం లో మునిగితే మాకేం
మాకు పండుగుంటే చాలు
మా కడుపు నిండుగుంటే చాలు
మాకెప్పుడూ తిండిపైనే ధ్యాస అయినా నీ కెందుకు
మాకెప్పుడూ పక్కోడిపై ఈర్ష్య వాడు బాగున్నందుకు
విజ్ఞానం ఎక్కడ ఛస్తే మాకేం-విప్లవాలున్నయి చాలు మాకు
ఉద్యోగాలెవడేలాలి- ఉద్యమాలు లేవదీస్తే చాలు మాకు
అవును మా’నవత’ గంజాయి మత్తులో జోగుతోంది
అవును మాయువత ఫాషన్ల పిచ్చిలో మగ్గుతోంది
అయినా మీకెందుకు ఇదే మామార్గం
అయితే మీకెందుకు ఇదే మా స్వర్గం
మేం ఏటేటా ఇలాగే ఉగాదులు జరుపుకొంటూంటాం
మేం ఇటువంటివే కవితలు ప్రతిసారీ చదూతుంటూంటాం
మా పరిధి ఇంతే-
దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమంటాం
మా ప్రగతి ఇంతే
అదిగో పులి అని ఒకడంటే ఇదిగో తోకను చూశామంటాం
మాది గుడ్డెద్దు చేలో బడ్డ విధానం
మేం గొర్రెదాటు జనం
మేం బావిలో కప్పలం
మేం గానుగల ఎద్దులం
నవ్వేవాణ్ణిచూసి ఏడుస్తుంటాం
ఏడ్చేవాణ్ణి చూసి నవ్వుతూ ఉంటాం
ఇదే మావైనం-ఇదే మా గ్నానం
మమ్మల్ని చూసి జాలి పడ్తావా నీ ఇష్టం
మమ్మల్ని చూసి ఏవగించుకొంటావా నీఖర్మం
అయినా నీ కెందుకు-
మా మనోరథానికి మేమే సారథులం!
అయితే నీకెందుకు-
మా ఇఛ్ఛా సామ్రాజ్యానికి మేమే సార్వభౌములం!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment