Thursday, November 26, 2009

శ్రీ సిద్దివినాయక నమః
శ్రీ ఆంజనేయ ప్రసన్నః
శ్రీ సరస్వత్యైనమః
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్పా
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
శ్రీమధ్ద్హర్మపురి నారసింహాయనమః

నా-నీ ధర్మపురి నరహరి శతకము

శ్రీ హరి
మాయమ్మ సిరి గురి
నాపై నుంచితే సరి
ధర్మపురి నరహరి (1)

నీ పదముల
కొల్తు నీ పదముల
చేర్చు నను పరమ పదముల
ధర్మపురి నరహరి(2)

మత్స్యావతారమెత్తి
వేదాలను వెదికి తెచ్చి
ఇచ్చావా ధర్మపురిని మెచ్చి
ధర్మపురి నరహరి (3)


కొండ మునగకుండ
తాబేలుగ నీ అండ
దక్కించెను సుధ కుండ
ధర్మపురి నరహరి (4)

ధరణి చెరను విడిపించగ
హిరణ్యాక్షు వధియించగ
వరాహమై వెలసితివిల
ధర్మపురి నరహరి(5)


దితిసుతుని దునుమాడగ
ప్రహ్లాదుడు నిను వేడగ
వెలిసావిట మానీడగ
ధర్మపురి నరహరి(6)

దానమడుగుమని అడుగు
బలితలమోపిన నీ అడుగు
చేర్చెనతని మడుగు అడుగు
ధర్మపురి నరహరి(7)

పరశువునే చేబూని
క్షత్రియులను దునుమాడి
తల్లిదండ్రుల మెప్పించిన భార్గవరాముడివీవె
ధర్మపురి నరహరి(8)

పితృవాక్య పరిపాలన
ఏకపత్ని వ్రత పాలన
శ్రీరామా ఎరిగితిమి నీ వలన
ధర్మపురి నరహరి(9)

చెలుల చీరలు దోచినా
చెల్లికి చీరలిచ్చి కాచినా
చెల్లెను నీకే గోట గిరిని మోసినా
ధర్మపురి నరహరి(10)

బుద్దావతారాన
హింసకెంతొ దూరాన
చేరితివి భవసాగర తీరాన
ధర్మపురి నరహరి(11)

తొలగించగ భువి భారం
నీ కల్క్యావతారం
లేదెంతో బహుదూరం
ధర్మపురి నరహరి(12)


రామాయణం సీత దాటిన గీత
భారతం శ్రీ కృష్ణు చాటిన గీత
జీవితం ఆ బ్రహ్మ గీసిన గీత
ధర్మపురి నరహరి (13)

బాలానందం బ్రహ్మానందం
నిత్యానందం పరమానందం
కృష్ణా నువు చాటిన గీతా మకరందం
ధర్మపురి నరహరి (14)

నీ ఆకారం భీకరం
మాట మకరందం
మనసు నవనీతం
ధర్మపురి నరహరి(15)

నీ కరమే
అభయకరమే
జనప్రియకరమే
ధర్మపురి నరహరి(16)

కనికరముతొ
కని కరముతొ
దీవించూ నను వరముతొ
ధర్మపురి నరహరి(17)

ధర్మ కాపరి
షడ్రిపు సంహారి
ఎవరయ్యా నీకు సరి
ధర్మపురి నరహరి(18)

స్నానానికి గోదావరి
దైవదర్శనానికి నరహరి
ఉభయ తారకం ధర్మపురి
ధర్మపురి నరహరి(19)


ధర్మపురి దరికొస్తే యమపురి లేదు
గోదావరిసరిమునిగితె నరకం దరిరాదు
నరహరి నిను దర్శిస్తె జన్మే మరి రాదు
ధర్మపురి నరహరి(20)

వేంకటలక్ష్మి మాతల్లి
మమతల పాలవెల్లి
పుట్టాలి తన కడుపున మళ్ళీమళ్ళీ
ధర్మపురి నరహరి(21)

జన్మజన్మలు పుణ్యాలు చెయ్య
అయినావు మాఅయ్య అంజయ్య
మా గురువూ దైవం నీవేనయ్య
ధర్మపురి నరహరి(22)

వంశము గొల్లపెల్లి
గోత్రము భరద్వాజ
తమ్ములు నల్గురిద్దరు చెల్లెళ్ళు
ధర్మపురి నరహరి(23)

గీత
అయ్యె నా జత
కుదిరె నా తల రాత
ధర్మపురి నరహరి(24)

మొదటి ఫలము సిద్దీశుడు
పిదప వరము హరీశుడు
ఇలవేల్పు కొండగట్టు కపీశుడు
ధర్మపురి నరహరి(25)

రామునిలో ఏకత్వం
కృష్ణునిలో భిన్నత్వం
సమతూకం నాతత్వం
ధర్మపురి నరహరి(26)


మా రమా
ఎపుడూ నీదయ కోరమా
భవసాగరమీద మాకిక భారమా
ధర్మపురి నరహరి(27)

సై మసై
మనసున మనసై
మనిషే రుషై
ధర్మపురి నరహరి(28)

ఛందస్సు లెంచకు
అలంకారము ల్లేవనకు
ప్రస్తుతించెద భక్తి ప్రస్తుతంబు
ధర్మపురి నరహరి(29)

నవవిధంబుల భక్తి
నవరసంబుల స్పూర్తి
పదవదిది యని నాకీయి ముక్తి
ధర్మపురి నరహరి(30)

ప్రకటింపలేను ఏరీతి నాభక్తి
మదిలోన నీపైన గలదనురక్తి
నీకు మాత్రం లేదా దానినెరుగు శక్తి
ధర్మపురి నరహరి(31)

పోలిక
చాలిక
నిన్ను నీవే మలచాలిక
ధర్మపురి నరహరి(32)


ఆశిస్తే
మనసున శిస్తే
ఫలితం పస్తే
ధర్మపురి నరహరి(33)

ఈ క్షణం
లో జీవనం
ఆనంద లక్షణం
ధర్మపురి నరహరి(34)

శంఖ చక్ర యుత హస్తద్వయం
దంష్ట్రాకరాళ సింహ ముఖం
త్వం లక్ష్మీ సహ‘యోగ స్థితం’
ధర్మపురి నరహరి(35)

దుఃఖం
బావురు మంటూ హృదయం
బరువు తీరితే సుఖం
ధర్మపురి నరహరి(36)

జననం
మరణం
అన్నింటికి సంపూర్ణం జనానికి భోజనం
ధర్మపురి నరహరి(37)

కులం గోకులం
మతం మానవతం
కావాలి నీతి అందరి జాతి
ధర్మపురి నరహరి(38)

పలుకు తేనెలొలుకు
మనసు విషము చిలుకు
మనిషేల హితుడు మనకు
ధర్మపురి నరహరి(39)

బాధ
కన్నా బాధలొఉన్నామన్న బాధ
ఎక్కువగా బాధ పెట్టే బాధ
ధర్మపురి నరహరి(40)


సమస్య
కు పరిష్కారం కానేకాదొక సమస్య
అంతా కోరుకొనేది అనునయమూ స్వాంతన
ధర్మపురి నరహరి(41)

నిన్నటి చింతన
రేపటి ఆంధోళన
నేటినీ మ్రింగే పూతన
ధర్మపురి నరహరి(42)

రణం
కారణం
సమాచార నివారణం
ధర్మపురి నరహరి(43)

కలిని
ఆ క లి ని
ప్రతిఘటించే రోకలిని
ధర్మపురి నరహరి(44)

ఊసరవెల్లులు
గుడ్లగూబలు గబ్బిలాలు
కేరాఫ్ రాజకీయాలు
ధర్మపురి నరహరి(45)

రాజకీయాల రసవద్ఘ్టట్టం
ద్రవ్యోల్బణానికి
దగ్గరి చుట్టం
ధర్మపురి నరహరి(46)

సబ్బుని
వాడి తొలగిస్తావ్ ఒంటి గబ్బుని
మరి మనసు మాలిన్యం జబ్బుని ?
ధర్మపురి నరహరి(47)


క్రికెట్టూ
సినిమా టికెట్టూ
చేస్తాయి స్టూడెంటుని నిండా మునిగేటట్టూ !
ధర్మపురి నరహరి(48)

వలపుల వల
లోపల చిక్కితే
బ్రతుకు వలవల
ధర్మపురి నరహరి(49)

సిగరెట్టు
రేటు గుండెలదిరెటట్టు
చేస్తే పెంచేట్టు మరి తాగితే ఒట్టు
ధర్మపురి నరహరి(50)

జూదం
అవ్వొచ్చు తత్కాల మోదం
క్లైమాక్స్ మాత్రం సదా విషాదం
ధర్మపురి నరహరి(51)

ఓటు
కాదు తలపోటు
వేయడం మంచి అలవాటు
ధర్మపురి నరహరి(52)

రమ్మని ఆమని తలుపు తీయగ
కమ్మని మామిడి ఆనతీయగ
కూయని కోయిల కూసె తీయగ
ధర్మపురి నరహరి(53)

అయారే! కరినగరి సినారె!!
అద్భుత గీతాలెన్నొ రాసినారె
తెలుగు గజళ్ళకు ప్రాణం పోసినారె
ధర్మపురి నరహరి(54)


కానికి కొరగాడు కాని,
కానివాడు ఎలాగని?
కృషితో వాడూ కుబేరుడు కాని
ధర్మపురి నరహరి(55)

నిన్ను నీవు
గెలువు
ప్రతి విజయం నీ పాదాక్రాంతం
ధర్మపురి నరహరి(56)

విజయాలన్ని
చేకూర్చలేవు ఆనందాన్ని?!
ఆనందం అందించేదే అసలైన విజయం
ధర్మపురి నరహరి(57)

రుచులు ఆరే
వండగలిగితె రోజూ పండగే!
స్వరాలు ఏడే,పాడ గలిగితె చిగుర్చేను మోడే!!
ధర్మపురి నరహరి(58)

వాడిన
పూలు పూజకు వాడిన
నేను నీకు కాని వాడిన!?
ధర్మపురి నరహరి(59)

మనసు భారం
మసాలా పులుపూ కారం
హడావిడి వ్యవహారం లేకుంటే అసిడిటీ దూరం
ధర్మపురి నరహరి(60)

ధీ
నిధీ
లేని బ్రతుకే మనలేనిది
ధర్మపురి నరహరి(61)


అవసరం అవకాశం
పాతాళం తొక్కేస్తాయి
లేదా ఎవరెస్ట్ నైనా ఎక్కిస్తాయి
ధర్మపురి నరహరి(62)

చదివిన కొద్ది చదువు
నీ కొద్దీ చదువు
చదివినకొద్దీ చదివించే చదువు చదువు
ధర్మపురి నరహరి(63)

నిండు కొలువు జనులు జేజేయని కొలువు
కొలువు కదా నిజమైన కొలువు
దారులు కొలువు కొలువు నీవెప్పుడు మానేవు
ధర్మపురి నరహరి(64)

చిక్కని
ప్రేమ ఎప్పటికైనా చిక్కని
భావించనెపుడు బ్రతుకే చిక్కని
ధర్మపురి నరహరి(65)

బిన్ లాడెన్
డెన్ వీడెన్?
ఎచటైనా కనబడెన్!?
ధర్మపురి నరహరి(66)

నేడు నీరు
కొనే తీరు
రేపు గాలికీ తయారు
ధర్మపురి నరహరి(67)

చెలీ నే కొన్నది
కదా నువు కట్టుకొన్నది
నీ చీర నా మనసునెంతో ఆకట్టుకొన్నది
ధర్మపురి నరహరి(68)


ఒబామా
ప్రపంచ శాంతికి నీవే భీమా
ప్రజలందరిదీ అదే ధీమా
ధర్మపురి నరహరి(69)

ప్రతి వారము నీ వారము
అంతా నీ పరివారము
అందుకొ మా కైవారము
ధర్మపురి నరహరి(70)

దక్కన్ గ్రామీణ బ్యాంకు
చిక్కెన్ ప్రజలకి అది తరగని ట్యాంకు
దక్కెన్ సేవలొ దానికి మొదటి ర్యాంకు
ధర్మపురి నరహరి(71)

తెలంగాణ
నాడు మౌన వీణ
నేడు దశదిశల మార్మోగే రుద్రవీణ
ధర్మపురి నరహరి(72)

జాడ పట్టుటకు డేగ
కూడబెట్టుటకు తేనెటీగ
గూడు కట్టుటకు గిజ్జిగ
ధర్మపురి నరహరి(73)

ఎత్తులు
జిత్తులు పొత్తులు
రాజకీయ మహత్తులు గమ్మత్తులు
ధర్మపురి నరహరి(74)

ఔరా! చిరంజీవి !
అవునా రాజకీయ చిరంజీవి
బాగౌనా బడుగు బడుగుజీవి?!
ధర్మపురి నరహరి(75)


ఆశపడితే నోటుకు
అమ్ముడౌతే ఓటుకు
బ్రతుకు బాట చేటుకు
ధర్మపురి నరహరి(76)

కులం అయస్కాంతం
మతం మత్తే సాంతం
జాతీయత చేసుకో సొంతం
ధర్మపురి నరహరి(77)

భాస్కర్రావ్ కొమ్మెర
భక్తికి పట్టుకొమ్మర
స్నేహమూర్తి నమ్మర
ధర్మపురి నరహరి(78)

అసాధ్యం అనేపదం
లేని నిఘంటువు విజయం
సాధ్యానికున్న మితులు కృషి,సమయం
ధర్మపురి నరహరి(79)

చిత్తశుద్ది లేని మాట "ప్రయత్నించడం"
ఇచ్చిచూడు కార్యానికి ప్రాధాన్యం
తప్పకుండ పొందేవు సాఫల్యం
ధర్మపురి నరహరి(80)

‘దయచేసి’
పలుకుమొదట దయచేసి
నడిపించును నీ నడత నల్లేరు బండిచేసి
ధర్మపురి నరహరి(81)

క్షమించు
అంటే ఏమి మించు
ఇరుహృదయాలుపశమించు
ధర్మపురి నరహరి(82)


ఒక్కసారి
చెప్పు సారి(sorry)
చేరును కంచికి స్టోరి
ధర్మపురి నరహరి(83)

సరే
అనడానికి కొసరే
వారు వాదనకి దగ్గరే
ధర్మపురి నరహరి(84)

ధన్యవాదములు
మనసుకు హాయిగొలిపే నాదములు
తెలుపగ మోదములు ఎల్లరకామోదములు
ధర్మపురి నరహరి(85)

క్రౌర్యం,నైచ్యం,హీనం,హేయం
మూర్ఖపు దుర్మార్గం,విశృంఖల దౌష్ట్యం
అన్నికలిపినా సరిపోలనిదే ఉగ్రవాదం
ధర్మపురి నరహరి(86)

ఉగ్రవాదం
వాస్తవ నరమేధం
ప్ర్తతిబింబింపజేయలేని పదం
ధర్మపురి నరహరి(87)

ప్రేరణ నీవే
కారణ మీవే
కవి తల కలంకరణము నీవె
ధర్మపురి నరహరి(88)

తెలుగు పలుకు
ఎపుడు పలుకు
తేనె లొలుకు
ధర్మపురి నరహరి(89)



అరమోడ్చగ రవి కళ్ళు
ఇలకురియగ చిరుజల్లు
విరియునుగా హరివిల్లు
ధర్మపురి నరహరి(90)

పచ్చదనం
స్వఛ్ఛదనం
ఏ మది మెచ్చదనం
ధర్మపురి నరహరి(91)

చెట్టు
చేస్తుంది మనిషి జీవించేట్టు
చేయాలి ఇంటింటా పెంచేట్టు
ధర్మపురి నరహరి(92)

జగతిలోన కాలుష్యం
జనులలోన వైషమ్యం
కావాలిక అదృశ్యం
ధర్మపురి నరహరి(93)

‘కీడెంచి మేలెంచు’ప్రగతికి రోతది
శుభం పలకరా అంటే...-సామెత పాతది
థింక్ పాజిటివ్ పాలసీ ఎపుడూ గొప్పది
ధర్మపురి నరహరి(94)

అందం
చూసేకళ్ళలో
ఆనందం పొందే గుండెలో
ధర్మపురి నరహరి(95)

చెరగని నవ్వులు
గుభాళించే పువ్వులు
ప్రభాసించే దివ్వెలు
ధర్మపురి నరహరి(96)



చిర్నవ్వితే
సొమ్మేం మునిగిపోదు
మర్దవంగ మాటాడితె కొంప అంటుకోదు
ధర్మపురి నరహరి(97)

ఎవరికీ
చెందకపోతే సరి
అప్పుడు నువ్వే అందరివాడివి
ధర్మపురి నరహరి(98)

తామరాకుమీద నీటిబొట్టు
జీవనవిధానం అయ్యేటట్టు
ప్రవర్తిస్తే ఆనందం నీ జత కట్టు
ధర్మపురి నరహరి(99)

మనసు కాదు కోతి
మనసు పెడితే
కాగలదు అది ఒక యతి
ధర్మపురి నరహరి(100)

నాలిక
నాపాలిక
వాచాలతకీ,చాపల్యతకీ
ధర్మపురి నరహరి(101)

ముక్కోటి యేకాశి
గోదాట మునకేసి
నీవిభవాన్ని చూసి తరియిస్తా కనుమూసి
ధర్మపురి నరహరి(102)

నీ దయ
నాపై ఏదయ
నవనీత హృదయ
ధర్మపురి నరహరి(103)

మిరిమిట్లు గొలుపు మెరుపులు నీ కనులు
భువి దద్దరిల్లు ఉరుములు నీ ధ్వనులు
ఎదబీడులు మురియకురియు వానలునీ దీవెనలు
ధర్మపురి నరహరి(104)

నీ అభయ హస్తం
బహుప్రాశస్త్యం
సుఖినోభవంతు లోకాస్సమస్తం
ధర్మపురి నరహరి(105)

కలనైనా రాయాలి నరహరి శతకము
ఇకనైనా వేయాలి సరియగు పథకము
ఎపుడైనా రావాలి దానికి బంగరు పతకము
ధర్మపురి నరహరి(106)

ఆరుబయట పగలు పండగ ఎండకొడుతుంది
పంట చేనులు సిరులు పండగ వానపడుతుంది
సంకురాతిరి పల్లె పండగ చ..చలి పెడుతుంది
ధర్మపురి నరహరి(107)

కోరెడి‘దివి’ నీవె
శతకము రాసెడి కవి నీవె
రాసిన ప్రతి పదము పథము నీవె
ధర్మపురి నరహరి(108)

నొప్పించితినో
జనులనొప్పించితినో
రాఖీ ఇల సెలవీయగ మిము మెప్పించితినో
ధర్మపురి నరహరి(109)

ఇల్లే జైలు
క్రమశిక్షణ విస్తరిస్తె
బ్రతుకే బోరు రోజూ వడ్డించిన విస్తరిస్తె
ధర్మపురి నరహరి(110)

ఏ పని
అదే పనిగా చేస్తే బోరు
ఏ పని లేకపోతె పరమబోరు
ధర్మపురి నరహరి(111)

దేన్నైనా
వదులుకో
నిన్నునీవు మినహా
ధర్మపురి నరహరి(112)

సాధనయే సాధనము సంగీతానికి
ప్రదానమే ప్రధానము జీవితానికి
నిదానమే విధానము ప్రశాంతానికి
ధర్మపురి నరహరి(113)

పట్టెనామాలు
కోర మీసాలు
నరుసయ్యానీకివె మా పొర్లుడు దండాలు
ధర్మపురి నరహరి(114)

నిను చూడని బ్రతుకు దండగ
నన్నే‘వాడ నీ’ మెడను పూదండగ
కురిపించు నీ దయను దండిగ
ధర్మపురి నరహరి(115)

సత్యవతి గుండము
తొలగించును కుజగండము
నిలబెట్టును దాంపత్యము తథ్యము
ధర్మపురి నరహరి(116)

నడిబొడ్డున కోనేరు
డోలోత్సవాల తీరు
తిలకించగ తనివితీరు?!
ధర్మపురి నరహరి(117)



గలగల గోదారి పారు
శ్రుతమగు వేదాల హోరు
శృతిమయ సంగీతాలు జాలువారు
ధర్మపురి నరహరి(118)

కృతి
సంస్కృతి
ధర్మపురి ఆకృతి
ధర్మపురి నరహరి(119)

సృష్టి కర్త బ్రహ్మ దేవుడు
ప్రాణ హర్త యముడు
నిలిచారిట సేవకులై నీవాకిట
ధర్మపురి నరహరి(120)

ఇసుక స్తంభము
అది ఒక అబ్బురము
పాతివ్రత్య నిదర్శనము
ధర్మపురి నరహరి(121)

ప్రహ్లాదుని కాచావట
శేషప్పని బ్రోచావట
రాఖీనే మరిచావట ?
ధర్మపురి నరహరి(122)

మంచికి గల దారులు వెయ్యి
అడ్డదారులిక మానెయ్యి
మంచికి నీవే దారులు వెయ్యి
ధర్మపురి నరహరి(123)

ముందర
పడితే తొందర
బ్రతుకే చిందర వందర
ధర్మపురి నరహరి(124)

తెలుపు
శాంతిని తెలుపు
ఏడు వర్ణాల కలగలుపు
ధర్మపురి నరహరి(125)

కూత
చేత
ఒకటైతే అది సత్యసంధత
ధర్మపురి నరహరి(126)

పుట్టుటే చాలు ధర్మపురియందు
గోదారి స్నానాల భాగ్యమందు
గోవింద నామాలు చెవుల విందు
ధర్మపురి నరహరి(127)

బంధుమిత్రుల పలకరింతలు
పండుగ పబ్బాల పులకరింతలు
దర్శనమిచ్చు ధర్మపురిలొ సంస్కృతికళల మేళవింతలు
ధర్మపురి నరహరి(128)

నిత్య కళ్యాణం
ప్రత్యక్ష వైకుంఠం
ధర్మపురి వీక్షణం
ధర్మపురి నరహరి(129)

ఏదైనా ఇవ్వడం
మనసారా నవ్వడం
నేర్పవే అందరివాడి నవ్వడం
ధర్మపురి నరహరి(130)

3 comments:

మైత్రేయి said...

good one.
Is it your own or collection?
Are you from Dharmapuri or any other place in Karimnagar?

our Kuladaivam is Dharmapuri Narasimha swamy.

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

yes nestam! maavooru dharmapuri maadaivam..narahari..galagalaapaare godavari maaku siri...
ee moodu blogulu..naa sweeya rachanale...naa vivaraalu photo annee unnaayigaa ..
migataa blogs..
www.raki9-4u.blogspot.com
raki9dash4u.wordpress.com
koodaa choosi mee amoolyamaina abhipraalaalu telapandi

A Rama Krishna Rao said...

Kavita adbhutanga vundi Raki.Thanks